మహిళల వస్త్రాధారణను ఉద్దేశిస్తూ.. బిహార్ సీఎం నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం నితీశ్ వ్యాఖ్యలు బిహార్ లోని సగం జనాభాకు అవమానకరమని విమర్శలు చేసారు. ప్రస్తుతం యువతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. వస్త్రధారణ కూడా బాగుంది. గతంలోనూ అమ్మాయిలు మంచి దుస్తులు ధరించడం మనమంతా చూశా కదా.. కానీ సీఎం నితీశ్ చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయి.
“మీరు ఒక సీఎం.. మహిళలకు ఫ్యాషన్ డిజైనర్ కాదు.. మీ ఆలోచనలు తారు మారవుతున్నాయి. మీరు ఫ్యాషన్ డిజైనర్ గా ఉండేందుకు ప్రయత్నించకండి. నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాష్టంలోని సగం జనాభాకు అవమానకరం” అని విమర్శించారు తేజస్వీ యాదవ్. ఇటీవల సీఎం నితీశ్ కుమార్ మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడారు. “నేను అధికారంలోకి వచ్చి ఎన్నో ఏళ్లు అవుతోంది. నాటితో పోల్చితే.. ఇప్పుడు అమ్మాయిల ఆత్మవిశ్వాసం ఎంతో మెరుగు పడింది. అన్ని అంశాలపై వారు చక్కగా ప్రసంగించగలుగుతున్నారు. వస్త్రధారణలోనూ మంచి మార్పు వచ్చింది. గత పాలకుల హయాంలో ఈ పరిస్థితి లేదు” అని వ్యాఖ్యానించారు.