దేశంలోని ఓటర్లకు ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు నచ్చని పక్షంలో ఎవ్వరికీ ఓటు వేయకుండా నోటా ఆప్షన్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, గత ఐదేళ్లలో దేశంలో జరిగిన సార్వత్రిక, ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో 1.29కోట్ల మంది ఓటర్లు ‘నోటా’కు ఓటువేసినట్లు వెల్లడైంది. ఇందుకు సంబంధించిన వివరాలను అసోసియేట్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది.
2018 నుంచి 2022 వరకు నోటాకు పడిన ఓట్ల సరళిని ఎడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ విశ్లేషించింది. ఈ మధ్యకాలంలో మొత్తంగా అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో 64 లక్షల ఓట్లు నోటాకు పడినట్లు తేలింది. ఇక లోక్‌సభ ఎన్నికల విషయానికొస్తే.. బిహార్‌లోని గోపాల్‌గంజ్ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధికంగా 51,660 ఓట్లు నోటాకు పోలయ్యాయి. అతి తక్కువ మాతం లక్షద్వీప్‌లో 100 ఓట్లు నోటాకు పడ్డాయి.
ఇక 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 7లక్షల 42వేలు నోటాకు పడ్డాయి. అతి తక్కువగా 2018లో జరిగిన మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో నోటాకు కేవలం 2917 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్ రాష్ట్రాల్లోని నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు ఎవ్వరూ లేకపోవడంతో అక్కడ నోటాకు కూడా ఒక్క ఓటు పడలేదు.
2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1.46 శాతం (7,49,360 ఓట్లు) నోటాకు పోల్ అవ్వగా.. వాటిలో అత్యధికంగా బిహార్‌లో(7,06,252 ఓట్లు) దిల్లీలో 43,108 ఓట్లు పోలయ్యాయి. అనంతరం 2022లో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 0.70శాతం మాత్రమే నోటాకు పడ్డాయి. గోవా, మణిపుర్‌లలో 10వేల చొప్పున, పంజాబ్‌లో లక్షా 10వేలు, ఉత్తర్‌ప్రదేశ్‌లో 6లక్షల 37వేలు, ఉత్తరాఖండ్‌లో 46వేల ఓట్లు నోటాకు పోలయ్యాయి.
ఇదిలాఉంటే, ఏదైనా నియోజకవర్గం ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే.. గెలుపు ఎవ్వరిదీ కాదని ప్రకటించాలని ఏడీఆర్ సిఫార్సు చేస్తోంది. మళ్లీ ఎన్నికలు నిర్వహించి.. అంతకుముందు పోటీలో ఉన్న అభ్యర్థులు మళ్లీ పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది.