ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు (జులై 10వ తేదీ 2024) ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత నిర్వహిస్తున్న తొలి ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు భార్య కమలేశ్ ఠాకుర్ సహా పలువురి భవితను ఇవి తేల్చనున్నాయి. ఎన్నికలు జరగబోతున్న స్థానాల్లో పశ్చిమ బెంగాల్‌లో నాలుగు స్థానాలు, హిమాచల్ ప్రదేశ్‌లో మూడు నియోజకవర్గాలు, ఉత్తరాఖండ్‌లో రెండు సీట్లు; బిహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్‌లలో ఒక్కొక్కటి చొప్పున నియోజకవర్గాలు ఉన్నాయి.
శాసన సభ్యుల కన్నుమూత, లేదా రాజీనామాల కారణంగా ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపును ఈ నెల 13 వ తేదీన చేపట్టనున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. పోలింగ్ కోసం ఇప్పటికే ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఓటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.