ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ఇవాళ మధ్యాహ్నం ప్రారంభమైంది. పాలక మండలిలో సభ్యులుగా ఉన్న పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే ఈ సమావేశానికి 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు దూరంగా ఉన్నారు. తెలంగాణ, పంజాబ్, దిల్లీ, పశ్చిమ బెంగాల్, బిహార్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, రాజస్థాన్ సీఎంలు ఈ భేటీకి హాజరుకావట్లేదని ఇప్పటికే ప్రకటించారు.
నీతి ఆయోగ్ మీటింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారమే ప్రకటించారు. ఈ మేరకు పీఎంకు లేఖ రాశారు. సుప్రీం ఆదేశాలకు కట్టుబడి ప్రధాని వ్యవహరించడం లేదని, అలాంటప్పుడు సాధారణ ప్రజలు న్యాయం కోసం ఎక్కడికి వెళ్తారని కేజ్రీ తన లేఖలో ప్రశ్నించారు. సహకార సమాఖ్యకు విలువ లేనప్పుడు, నీతి ఆయోగ్ మీటింగ్‌కు హాజరుకావడం జోకే అవుతుందని అన్నారు.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా నీతి ఆయోగ్ సమావేశాన్ని బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించారు. పంజాబ్ రాష్ట్ర ప్రజల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించే వరకు సమావేశంలో పాల్గొనడం వల్ల ప్రయోజనం లేదని అన్నారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక మంత్రి, చీఫ్ సెక్రటరీని నీతి ఆయోగ్ సమావేశానికి పంపుతామన్న పశ్చిమ బెంగాల్ విజ్ఞప్తిని కేంద్రం పరోక్షంగా తిరస్కరించింది. ‘సీఎం హాజరు కావొచ్చు’ అని సూచించింది. ఇక ఆరోగ్య సమస్యల కారణంగా ఈ మీటింగ్‌కు హాజరు కాలేనని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ వెల్లడించారు.