డ్రగ్స్ మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. దేశంలోకి డ్రగ్స్ సరఫరా కాకుండా కట్టడి చేసేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మత్తు పదార్థాల సరఫరా నియంత్రణ కోసం త్వరలో కొత్త విధ్వంసక వ్యవస్థను తెచ్చేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఒక్క గ్రాము డ్రగ్‌ను కూడా దేశంలోకి రానివ్వమని ఆయన తెలిపారు.
అలాగే మన దేశం ద్వారా ఇతర దేశాలకు మత్తు పదార్థాలు సరఫరా కానివ్వమని అమిత్ షా స్పష్టం చేశారు. దిల్లీలో జరిగిన కేంద్ర, రాష్ట్ర యాంటీ నార్కోటిక్ సంస్థల 7వ అపెక్స్ సమావేశంలో పాల్గొన్న అమిత్ షా డ్రగ్స్ సరఫరా వ్యవస్థను ధ్వంసం చేసేందుకు చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు, మానస్ (MANAS) పేరుతో ‘1933’ హెల్ప్‌లైన్ నంబరును, info.ncbmanas@gov.in ఈ-మెయిల్ ఐడీని ప్రారంభించారు. వీటితోపాటు ncbmanas.gov.in అనే వెబ్‌సైట్‌లోనూ డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని, మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్‌సీబీ)కి అందించవచ్చని అమిత్ షా పేర్కొన్నారు.