ఇటీవల అస్సాంలో లేడీ సింగం గా గుర్తింపు పొందిన మహిళా పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ జున్ముణి రాభా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తన వ్యక్తిగత పనుల మీద వెళ్తుండగా కారు ప్రమాదంలో ఈమె మృతి చెందింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఓ కీలక విషయం తెలిసింది.
లేడీ సింగం ప్రమాదంపై సోషల్ మీడియాలో ఓ ఆడియో క్లిప్‌తోపాటు మరో వీడియో వైరల్ కావడం కలకలం రేపుతోంది. రాభాను పోలీసు శాఖలోని కొందరు అధికారులు చిత్రహింసలు పెట్టి చంపారంటూ ఓ కానిస్టేబుల్ ఆ ఆడియో క్లిప్‌ను విడుదల చేసినట్లు సమాచారం. రాభా అనుమానాస్పద మరణంపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు ఆ కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ప్రమాద సమయంలో రాభా వాహనం ట్రక్కును ఢీకొనలేదని, ఆ సమయంలో ఆమె కారు నిలిపే ఉందని, ట్రక్కు వచ్చి దాన్ని ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షిగా చెప్పుకొంటున్న ఓ వ్యక్తి వీడియో విడుదల చేశాడు. ట్రక్కు ఢీకొట్టడానికి ముందు కారులో నుంచి ఇద్దరు వ్యక్తులు దిగిపోయారని అతడు పేర్కొన్నాడు.