అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. అయోధ్యలో ప్రతిష్ఠించే రాముడి విగ్రహాన్ని జనవరి 17వ తేదీన ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం మూడు విగ్రహాలు పూజకు సిద్ధంగా ఉన్నాయి. అందులో నుంచి ఒక విగ్రహాన్ని ఎంపిక చేయనున్నారు. ఈ విషయాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు శ్రీ విశ్వప్రసన్న స్వామిజీ తెలిపారు.
మరోవైపు రామాలయ పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. బంగారు తాపడంతో రూపొందించిన తలుపులను రామాలయ గర్భగుడికి అమర్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. దిల్లీకి చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థ తలుపులకు బంగారు తాపడం చేసిందని వెల్లడించారు. మిగిలిన 14 తలుపులకు స్వర్ణ తాపడాన్ని చేస్తామని చెప్పారు.
ఇంకోవైపు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర పర్యటక శాఖ చరణ్ పాదుక యాత్ర కోసం పటిష్ఠ ఏర్పాటు చేసింది. మకర సంక్రాంతిని పురస్కరించుకుని జనవరి 14న చిత్రకూట్ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుందని రాష్ట్ర మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు. మంఝాపుర్, కౌశాంబి, ప్రతాప్‌గఢ్, సుల్తాన్‌పుర్, ప్రయాగ్‌రాజ్ మీదుగా వెళ్లే యాత్ర జనవరి 19న అయోధ్యలోని నందిగ్రామ్ వద్ద ముగుస్తుందని చెప్పారు.