వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ఆలయానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఎంత పెద్ద ప్రకృతి విపత్తు వచ్చినా తట్టుకుని నిలబడేలా ఈ ఆలయాన్ని డిజైన్ చేస్తున్నారు. తాము నిర్మించిన ఈ రామాలయం 2,500 ఏళ్లు చెక్కు చెదరకుండా నిలుస్తుందని ఆర్కిటెక్ట్ ఆశీశ్ సోంపురా అన్నారు. ఆలయ నిర్మాణంలో పచ్చదనానికి పెద్దపీట వేసినట్లు తెలిపారు.
“అయోధ్య రామాలయాన్ని భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా నాగర శైలిలో నిర్మిస్తున్నాం. అష్టభుజి ఆకారంలో గర్భ గుడిని తీర్చిదిద్దుతున్నాం. భారతదేశంలో గర్భ గుడి అష్టభుజి ఆకారంలో ఉన్న దేవాలయాలు చాలా తక్కువ. కానీ అయోధ్య రామాలయం గర్భ గుడి ఆ ఆకారంలోనే ఉంది. ఆలయ శిఖరం కూడా అష్టభుజి ఆకారంలోనే ఉంటుంది. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చేందుకు సహజ సిద్ధంగా ఉండేలా ఆలయాన్ని డిజైన్ చేశాం. ప్రధాన ఆలయ సముదాయం వరకు వెళ్లే కారిడార్‌లో 35వేల నుంచి 40వేల మంది ప్రయాణించే అవకాశం ఉంది.” అని ఆర్కిటెక్ట్ ఆశీస్ సోంపురా వివరించారు.