18వ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ఒడిశాకు చెందిన సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్ వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఒడిశాలోని కటక్ నుంచి ఏడుసార్లు విజయం సాధించిన భర్తృహరి, స్పీకర్ ఎన్నిక పూర్తయ్యే వరకు లోక్‌సభ ప్రిసైడింగ్ అధికారిగా కార్యకలాపాలు నిర్వహిస్తారని కిరణ్ రిజిజు తెలిపారు.
18వ లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారని కిరణ్ రిజుజు వెల్లడించారు. ఆయనకు కె.సురేష్ (కాంగ్రెస్), టీఆర్ బాలు (డీఎంకే)తో పాటు రాధామోహన్ సింగ్ (బీజేపీ), ఫగ్గన్ సింగ్ కులస్తే (బీజేపీ), సుదీప్ బంధోపాధ్యాయ (టీఎంసీ) ఛైర్‌పర్సన్‌ల ప్యానెల్ సహాయంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.
మరోవైపు ఈనెల 24 నుంచి జులై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. 18వ లోక్‌సభ తొలిసెషన్ జూన్ 24న ప్రారంభమవుతుందని రిజిజు చెప్పారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో కొత్తగా ఎన్నికల ఎంపీలు ప్రమాణం స్వీకారం చేయనున్నారు.