ఉత్తర్ ప్రదేశ్లోని హాథ్రస్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ సత్సంగ్ నిర్వహించిన భోలేబాబా ప్రస్తుతం కాస్‌గంజ్‌లో ఉన్న ఆశ్రమానికి తిరిగి వెళ్లి అక్కడ పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. జరగబోయేదాన్ని ఎవరు ఆపగలరని, వచ్చిన వారు ఏదో ఒకరోజు వెళ్లిపోవాల్సిందేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
జులై 2వ తేదీన చోటుచేసుకున్న ఘటన తర్వాత బాధపడ్డానని.. కానీ, జరగబోయేదాన్ని ఎవరు ఆపగలరు? వచ్చిన వారు ఏదో ఒకరోజు వెళ్లిపోవాల్సిందేనని భోలే బాబా వ్యాఖ్యానించారు. అక్కడ విషపూరిత స్ప్రే గురించి తన న్యాయవాది, ప్రత్యక్ష సాక్షులు చెప్పారని తెలిపారు. ఆ ఘటన వెనుక ఏదో కుట్ర దాగి ఉన్న మాట వాస్తవమన్న బాబా.. సిట్, జ్యుడీషియల్ కమిషన్‌పై తమకు విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం తన జన్మస్థలమైన కాస్‌గంజ్‌లోని బహదుర్ నగర్‌లో ఉన్నానని భోలే బాబా తెలిపారు. మరోవైపు హాథ్రస్ దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. దీని వెనక కుట్ర కోణాన్ని తోసిపుచ్చలేమని అనుమానం వ్యక్తం చేసింది.