బిహార్‌లో కల్తీ మద్యం సేవించి చప్రా, సరన్ జిల్లాల్లో 50 మందికి పైగా మరణించిన నేపథ్యంలో మృతులకు ఎలాంటి పరిహారం అందిచబోమని సీఎం నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ మద్యం తాగితే మరణిస్తారని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని, మద్యపానానికి అనుకూలంగా మాట్లాడిన వారెవరూ మేలు చేసేవారు కాదని పేర్కొన్నారు.
మరోవైపు నితీశ్ వ్యాఖ్యలపై విపక్ష నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేసిన సీఎం తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చప్రా జిల్లాలో కల్తీ మద్యం సేవించి 50 మందికి పైగా మరణించిన ఘటన మరవకముందే సివన్ జిల్లాలోని భగవాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ మద్యం సేవించిన నలుగురు వ్యక్తులు మరణించారు. 2016 ఏప్రిల్‌లో నితీశ్ కుమార్ సర్కార్ బిహార్‌లో మద్యం తయారీ, విక్రయాలను నిషేధించింది. అయినా తరచూ ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి.
మరోవైపు చప్రా కల్తీ మద్యం వ్యవహారంలో ప్రత్యక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ నమోదైంది. బిహార్‌లో మద్యం తయారీ, విక్రయం, అక్రమ మద్యం నియంత్రణ కోసం కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. తమ రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ విపక్ష ప్రతినిధులు నేడు గవర్నర్ పగు చౌహాన్‌ను కలవనున్నారు.