బిజెపి నేత, కర్ణాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కాషాయ జెండా దేశానికి జాతీయ జెండా గా మారుతుందని వ్యాఖ్యానించారు.త్యాగానికి కాషాయ జెండా చిహ్నమని అన్నారు. ఈ దేశంలో ఎప్పటినుంచో కాషాయ జెండాకు గౌరవం ఉందని, వేల సంవత్సరాలుగా కాషాయ జెండా త్యాగానికి సంకేతంగా నిలిచిందని చెప్పారు.
ఆర్ఎస్ఎస్ లో కాషాయ జెండా ముందు నిలుచుని ఆ విలువలు తమలో నిండాలని కోరుకునే వారమని అన్నారు. రేపోమాపో ఏదో ఒకరోజు కాషాయ పతాకం జాతీయ పతాకం గా నిలుస్తుందని.. ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆయన పేర్కొన్నారు. మన రాజ్యాంగం ప్రకారం మూడు రంగుల జెండా మన జాతీయ పతాకమని, దానికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో అంత వరకు ఇస్తామని చెప్పారు. కాగా ఈశ్వరప్ప వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు.