దేశ వాణిజ్య రాజధాని ముంబయికి మరోసారి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. శుక్రవారం ఉదయం ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి నగర వ్యాప్తంగా ఆరు ప్రదేశాల్లో బాంబులు పెట్టినట్లు బెదిరించాడు. ఈ ఫోన్ కాల్ తో ముంబయి పోలీసులు అప్రమత్తమయ్యారు. క్రైమ్ బ్రాంచ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు ముంబయి పోలీసులు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు ట్రాఫిక్ పోలీస్ హెల్ప్‌లైన్‌కు చెందిన వాట్సాప్ నంబరుకు కాల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఫోన్ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
ముంబయికి గతంలోనూ పలుమార్లు బాంబు బెదిరింపులు వచ్చాయి. న్యూ ఇయర్ వేడుక వేళ ఓ వ్యక్తి ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు చెప్పాడు. అంతకుముందు కూడా ఆర్‌బీఐ ఆఫీసులు సహా పలు బ్యాంకులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ఈ తరహా బెదిరింపులు రాగా అవన్నీ నకిలీవేనని తేలింది.