నేడు ఇంద్రవెల్లికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి పయనం కానున్నారు. ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ భారీ బహిరంగసభ ఉన్న తరుణంలోనే..ఇంద్రవెల్లికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి పయనం కానున్నారు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు రానున్నారు.
పీసీసీ అధ్యక్షుడి హోదాలో తొలిసారి 2021 ఆగస్టు 9న ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం ఆవరణ వేదికగా జరిగిన ‘ఆదివాసి-గిరిజన-దళిత దండోరా’ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అదే వేదికగా ఇవాళ జరిగే ‘తెలంగాణ పునర్నిర్మాణ సభ’లో లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన తర్వాత ఏర్పాటు చేస్తున్న మొదటి సభ ఇదే కావడంతో పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం నలుమూలలా నుంచి జన సమీకరణపై దృష్టి సారించింది. ఈ ఏర్పాట్లను గురువారం మంత్రి సీతక్క, స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు పర్యవేక్షించారు. మరోవైపు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో, స్వరాష్ట్రంలో నిరాదరణకు గురైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటానని శాసనసభ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన జిల్లా ప్రజల్లో ఆశలను రేకెత్తిస్తోంది.