మణిపుర్​లో నగ్నంగా మహిళల ఊరేగింపు కేసు.. ఏడుగురిపై సీబీఐ ఛార్జిషీట్

-

మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈ ఘటనతో సంబంధం ఉన్న ఏడుగురిపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ ఏడుగురు నిందితుల్లో ఒకరు మైనర్​ ఉన్నారని సీబీఐ అధికారులు తెలిపారు. మణిపుర్ పోలీసులు అరెస్టు చేసిన నిందితులకు ఈ ఘటనలో ప్రమేయం ఉన్నట్లు తేలిందని వెల్లడించారు. తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. నిందితులపై  సామూహిక అత్యాచారం, హత్య, మహిళ పట్ల అసభ్య ప్రవర్తన, నేరపూరిత కుట్ర వంటి నేరాల కింద అభియోగాలు మోపినట్లు వివరించింది.

జులై నెలలో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర సర్కార్ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి ఈ కేసును సీబీఐకి అప్పజెప్పింది.

ఇదీ జరిగింది.. కాంగ్‌పోప్కి జిల్లాలో తమ వర్గానికి చెందిన ఓ మహిళపై అత్యాచారం చేశారన్న ఆరోపణలపై కొందరు యువకులు మరో వర్గానికి చెందిన గ్రామాలపై దాడులకు దిగారు. తమ ఊరిపై కూడా వారు దాడి చేస్తారనే సమాచారంతో మే 4న బీ.ఫయనోమ్‌ గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు నాంగ్‌పోక్‌ సెక్‌మై వద్ద పోలీసులు కనిపించగా వారి వద్దకు వెళ్లారు. ఆ సమయంలో  దాదాపు వెయ్యి మందితో ఉన్న భారీ గుంపు ఆ గ్రామంలోకి ప్రవేశించి ఐదుగురిని అడ్డగించి.. దాడికి పాల్పడగా ఆ ఘటనలో పురుషులిద్దరు మరణించారు. 21 ఏళ్ల యువతితోపాటు మరో మహిళను నగ్నంగా ఊరేగిస్తూ సమీప పొలాల్లోకి తీసుళ్లి వారిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version