దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ రేపటితో ముగియనుంది. మొత్తం ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆరు విడుతల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఏడో విడత చివరి ఫేజ్ లో రేపు పోలింగ్ జరగనుంది. ఏడో విడత పోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. చివరి దశలో భాగంగా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 57 లోక్ సభ స్థానాలకు, ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. బీహార్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రేపు పోలింగ్ జరుగుతుంది.
శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఏడో విడతలో 10.06 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 5.24 కోట్లమంది పురుషులు, 4.82కోట్ల మంది మహిళ ఓటర్లు, 3574 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం 1.09 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఆరు విడతల్లో 28 రాష్ట్రాల్లో 486 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఏడో విడతలో ఎన్నికలు జరిగే 57 స్థానాల్లో 41 జనరల్, మూడు ఎస్టీ, 13 ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు ఉన్నాయి