ఉమ్మడి మీటర్లపై కరెంటు ఛార్జీల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి మీటరు తీసుకున్న వారి నుంచి వసూలు చేసే వినియోగ ఛార్జీలను నియంత్రించాలని కేంద్ర విద్యుత్తుశాఖ రాష్ట్రాలకు అల్టిమేటమ్ జారీ చేసింది. అది ఏ మేరకు ఉండాలో ‘రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి’(ఈఆర్‌సీ) మరోసారి సమీక్షించి నిర్ణయించిన తర్వాత ఆ ఛార్జీనే డిస్కంలు వసూలు చేయాలని తెలిపింది. దీంతో అపార్టుమెంట్లు, గృహసముదాయాల్లో విద్యుత్తు వినియోగరులకు ఊరట లభించనుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24)లో రాష్ట్రంలో ఉమ్మడి మీటరుతో కనెక్షన్ తీసుకుంటే మొదటి యూనిట్ నుంచి ఎంత కరెంటు వాడుకున్నా యూనిట్‌కు రూ.7.30 చొప్పున ఒకే ఛార్జీని డిస్కంలు వసూలు చేయాలని ఈఆర్‌సీ మార్చి 21న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్రం విద్యుత్ సంస్థల వాస్తవ ఖర్చులను విశ్లేషించి కొత్తగా యూనిట్ రేటు నిర్ణయించాలని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఒకే కనెక్షన్‌తో ఉమ్మడి మీటరు ద్వారా కరెంటు వాడుకునే ఇంటి యజమాని ఎవరైనా తనకు విద్యుత్తు వాహనం ఉందని, విడిగా మరో కనెక్షన్ ఇవ్వాలని అడిగితే తప్పకుండా ఇవ్వాలని సూచించింది.