మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్లో చీతాల మరణాలు ఇంకా కొనసాగుతూన్నాయి. ఈనెల 2వ తేదీన ఉదయం మరో చీతా మృత్యువాత పడింది. ‘ధాత్రి’ అనే ఆడ చీతా మరణించినట్లు మధ్యప్రదేశ్ అటవీ శాఖ ప్రకటనను విడుదల చేసింది. మరణానికి గల కారణం పోస్టుమార్టమ్ పరీక్షల ఫలితాల అనంతరం తెలుస్తుందని తెలిపింది.మార్చి నుంచి ఇప్పటి వరకు తొమ్మిది చీతాలు మరణించాయి.
‘ప్రాజెక్టు చీతా’లో భాగంగా నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి రెండు విడతల్లో 20 చీతాలను భారత్‌కు రప్పించిన విషయం తెలిసిందే. ఆ 20 చీతాల్లో ఇప్పటివరకు.. ధాత్రితో కలిపి ఆరు పెద్ద చీతాలు మృతి చెందాయి. నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాకు నాలుగు పిల్లలు జన్మించగా.. అందులో మూడు ప్రాణాలు కోల్పోయాయి. ఫలితంగా మొత్తం చీతా మరణాల సంఖ్య తొమ్మిదికి చేరింది. జీవించి ఉన్న పిల్ల చీతాను నిపుణుల సమక్షంలో పెంచుతున్నారు. భారత్లో చీతాల సంఖ్యను వృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ పరిణామాలు ఆటంకంగా నిలిస్తున్నాయి.