హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. నిన్న మైసూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సిద్ధరామయ్య ఈ ప్రకటన చేశారు. గతంలో బీజేపీ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తేస్తున్నామని, ఇక నుంచి హిజాబ్ ధరించడంపై ఎటువంటి నిషేధం ఉండదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
హిజాబ్ నిషేధంపై ప్రకటన చేసిన 24 గంటలు గడవకముందే సిద్ధరామయ్య యూటర్న్ తీసుకున్నారు. తాను అలాంటి ప్రకటన చేయలేదని, అధికారులతో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని శనివారం పేర్కొన్నారు. నిన్న మైసూర్ పర్యటన సందర్భంగా హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తేస్తారా? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, హిజాబ్ ధరించడంపై ఉన్న ఆంక్షలను మేం ఇంకా ఉపసంహరించుకోలేదు. హిజాబ్ ధరించడంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని ఆలోచిస్తున్నామని, దానిపై చర్చలు జరిపి, ఆపై ఖరారు చేస్తామని తాను బదులిచ్చానని సిద్ధరామయ్య చెప్పారు. మహిళలు తమకు నచ్చిన దుస్తులను ధరించొచ్చు. అది వారి హక్కు అని సీఎం శుక్రవారం పేర్కొన్నారు. ప్రధాని మోదీ పదేపదే వ్యాఖ్యానించే సబ్ కా సాత్, సబ్ కా వికాస్ ఉట్టి బోగస్ మాటలు అని ధ్వజమెత్తారు.