ఎంపీ, బాలీవుడ్ నటి కంగనారనౌత్ తనను కలిసేందుకు వచ్చేవారు వెంట ఆధార్ కార్డ్ తెచ్చుకోవాలని చెప్పడంపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ప్రజలను అలా అడగడం సరికాదని హితవు పలికింది. ప్రజాప్రతినిధులుగా రాష్ట్రంలో ప్రతి వర్గానికి చెందిన ప్రజలను కలవాల్సిన బాధ్యత ఉంటుందని.. పని ఏదైనా ప్రజలు నాయకులను కలవడానికి వచ్చినప్పుడు గుర్తింపు కార్డు తెచ్చుకోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.
ఇటీవల కంగన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను కలిసేందుకు వచ్చే నియోజకవర్గ ప్రజలు తమవెంట ఆధార్ కార్డు ఉంచుకోవాలి. అలాగే నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నారో ఆ కారణాన్ని ఒక పేపర్‌పై రాసివ్వాలి. దానివల్ల ఎలాంటి అసౌకర్యానికి తావుండదు’’ అని ఆమె అన్నారు. రాష్ట్రంలోని ఉత్తర ప్రాంత ప్రజలు తనతో మీట్ అయ్యేందుకు మనాలిలోని తన ఇంటికి కూడా రావొచ్చని తెలిపారు. దీనిపై కాంగ్రెస్ నేత, హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ఎంపీని కలుసుకోవాలంటే ఆధార్ కార్డు అవసరం లేదని అన్నారు.