దేశ రాజధాని దిల్లీలోని నూతన ఎక్సైజ్ విధానంపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పాలసీని ఉపసంహరించుకుంటున్నామని, మరో ఆరు నెలల పాటు పాద మద్యం విధానాన్నే కొనసాగించనున్నట్లు ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా శనివారం వెల్లడించారు. అంతేగాక, ప్రభుత్వం నిర్వహించే దుకాణాల ద్వారానే మద్యాన్ని విక్రయించాని ఆదేశించారు.
గతేడాది నవంబర్ నుంచి నూతన మద్యం విధానం 2021-22ను దిల్లీ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. అయితే ఈ విధానంపై విమర్శలు రావడంతో పాటు ఎల్‌జీ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతో దిల్లీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
ప్రస్తుతానికి నూతన మద్య విధానాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఎక్సైజ్ శాఖను నిర్వహిస్తోన్న ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా నేడు తెలిపారు. మరో ఆరు నెలల పాటు పాత మద్యం విధానాన్నే కొనసాగించనున్నట్లు తెలిపారు.
కొత్త ఎక్సైజ్ విధానంలో.. కొన్ని లోపాలు ఉన్నాయని, టెండర్ల జారీ తర్వాత మద్యం లైసెన్సుదారులకు అనుచిత లబ్ధి చేకూర్చేలా దీన్ని తయారు చేశారని దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇటీవల ఓ నివేదిక ఇచ్చారు. దీనివల్ల ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లినట్లు నివేదికలో తెలిపింది.
ఈ నివేదిక ఆధారంగా ఈ విధానంపై దర్యాప్తు జరపాలని లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐకి సిఫార్సు చేశారు. నూతన మద్యం విధానంలో చోటుచేసుకున్న నియమాల ఉల్లంఘనతో పాటు విధానపరమైన లోపాలపై దర్యాప్తు చేపట్టాలని సూచించారు.