దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రజలు వేడుకలు నిర్వహించుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో శుక్రవారం రాత్రి నాలుగో దీపోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. లక్షల మట్టి ప్రమిదల్లో ఏర్పాటు చేసిన దీపాలను వెలిగించారు.
అయోధ్య నగరాన్ని వైదిక, ఆధునిక నగరిగా అభివృద్ధి చేసేందుకు ప్రపంచంలోనే అతి పొడవైన విగ్రహ నిర్మాణం చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి విరివిగా నిధులు కేటాయిస్తుండటంతో రైల్వే లైను డబ్లింగు, రైల్వే స్టేషను ఆధునీకరణ పనులు చకచకా జరుగుతున్నాయన్నారు. ఈ మేరకు అయోధ్య నుంచి సుల్తాన్ పూర్ ఎన్ హెచ్ 330 వరకు నాలుగు వరుసల రోడ్డు వేయిస్తున్నారు. దీంతోపాటుగా అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయ పునరుద్ధరణ పనులకు రూ.18.75 కోట్లు కేటాయించారు. రాయ్ బరేలి నుంచి అయోధ్య వరకు నాలుగు వరుసల రోడ్డు విస్తరణ పనులకు రూ.1,500 కోట్ల కేటాయించారు.
దీపావళి సందర్భంగా యూపీ ప్రభుత్వం చేసిన దీపోత్సవం ఏర్పాట్లు ప్రపంచ రికార్డును సృష్టించాయి. శుక్రవారం రాత్రి సమయంలో 8 వేల వాలంటీర్లు సరయూ నదీ తీరాన 6 లక్షలకు పైగా దీపాలు వెలిగించారు. మొత్తంగా 6,06,569 దీపాలను మట్టి ప్రమిదలతో వెలిగించినట్లు వేడుకకు హాజరైన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ప్రతినిధులు ప్రపంచ రికార్డుగా గుర్తించి సర్టిఫికెట్ ను అందించారు.