టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణంతో సువర్ణాక్షరాలు లిఖించిన భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ లోనూ బంగారు పతకం సాధించి శెభాష్ అనిపించుకున్నారు. ఈ రికార్డులు సాధించిన తొలి భారతీయుడిగా నీరజ్ నిలిచాడు. భారతావనికి ఘనకీర్తిని తీసుకొచ్చిన నీరజ్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే భారత్ తో పాటు విదేశాల్లోనూ ఆయనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ప్రపంచ అథ్లెటిక్స్ లో చారిత్రక విజయం తర్వాత స్టేడియంలోని అభిమానుల దగ్గరికి వెళ్లిన నీరజ్ అడిగిన వారితో ఫొటోలు దిగి, ఆటోగ్రాఫ్స్ ఇచ్చాడు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
నీరజ్ అభిమాని అయిన హంగేరీ మహిళ.. ఆటోగ్రాఫ్ కోసం ఆయన వద్దకు వచ్చింది. వచ్చీరావడంతోనే హిందీలో అనర్గళంగా మాట్లాడుతూ ఆటోగ్రాప్ కోరింది. భారత జాతీయ జెండాను ఆయన ముందు పరిచి సంతకం చేయాలని విజ్ఞప్తి చేసింది. అయితే నీరజ్ మాత్రం అందుకు ససేమిరా అన్నాడు. త్రివర్ణ పతాకంపై ఆటోగ్రాఫ్ ఇవ్వలేనని, తాను జెండాను అమితంగా గౌరవిస్తానని చెప్పాడు. అదే సమయంలో ఆమె తన టీ షర్ట్ పై సంతకం చేయాలని రిక్వెస్ట్ చేయడంతో, అందుకు అంగీకారం తెలిపిన నీరజ్… టీ షర్ట్ పై ఆటోగ్రాఫ్ చేశాడు. దీంతో ఆ మహిళ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. మరోవైపు నీరజ్ చోప్రా చేసిన ఈ పనితో ప్రశంసల వర్షం కురిస్తోంది. జాతీయ పతాకంపై అంతులేని ప్రేమను, గౌరవాన్ని కనబరచిన ఇండియన్ గోల్డెన్ బాయ్ పై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.