గత కొద్దికాలంగా టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా వ్యవహారం వివాదాస్పదమవుతున్న విషయం తెలిసిందే. పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలను ఆమె ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు నైతిక విలువల కమిటీ ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక రూపొందించింది. ఈ నివేదిక ఇవాళ లోక్‌సభ ముందుకు వచ్చింది. ఈ నివేదికను బీజేపీ ఎంపీ, ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ విజయ్ సోన్కర్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆరోపణల నేపథ్యంలో మహువాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని కమిటీ ఆ నివేదికలో సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ నివేదికను లోక్‌సభలో ప్రవేశపెట్టడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఎథిక్స్ కమిటీ నివేదిక కాపీ తమకు ఇవ్వాలని, దీనిపై ఓటింగ్ నిర్వహించడానికి ముందు సభలో చర్చ జరగాలని పట్టుబట్టాయి. ఈ క్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. స్పీకర్ వారించినా విపక్ష సభ్యులు ఆందోళనను విరమించకపోవడంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఈ నివేదికను సభ ఆమోదించినట్లయితే మహువా మొయిత్రా లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురవుతారు.