18వ లోక్సభలో ఈసారి 280 మంది తొలిసారి ఎంపీగా ఎన్నికైన సభ్యులు ఉన్నారు. వారందరికీ కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక సదుపాయాలతోపాటు ఉచిత సౌకర్యాలను కల్పిస్తుంది. జీతం, ప్రయాణ భత్యాలు, వైద్య సదుపాయాలు, బంగ్లా, ఫోన్ సౌకర్యం, పెన్షన్ వంటి అనేక ప్రయోజనాలు ఉంటాయి. వాటితో పాటు ఇంకా ఏమేం ఉన్నాయంటే?
2022 మే 11 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం ఒక్కొక్క ఎంపీకి నెలకు జీతంగా రూ.లక్ష అందుతుంది. అదనంగా, సమావేశాల కోసం అలవెన్సుల కింద కేంద్ర ప్రభుత్వం. రోజుకు రూ.2000 ఇస్తుంది. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు, ఇతర అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యం. ఎంపీలకు ఫస్ట్ క్లాస్ రైల్వే కోచ్‌లలో ఉచిత ప్రయాణ సదుపాయం. ప్రతి ఎంపీకి ఆఫీస్ అలవెన్స్ కింద రూ.20,000, స్టేషనరీకి రూ. 4,000, పోస్టల్ ఛార్జ్ కోసం రూ.2000 ఇస్తుంది. ప్రతి పార్లమెంట్ సభ్యుడికి దిల్లీలోని వాహనానికి, మరొకటి వారి సొంత నియోజకవర్గానికి చెందిన వాహనానికి ఫ్రీ ఫాస్టాగ్ కేటాయిస్తుంది. పదవీ కాలం పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రతి సభ్యుడికి నెల వారీ పెన్షన్ ( రూ.22 వేలు) అందిస్తుంది.