ఆవులు, మేకలను పులులు చంపడం కామన్. తమ పశువులను పులులు బలి తీసుకుంటుంటే రైతులు ఏం చేయలేక బాధపడుతుంటారు. కానీ తమిళనాడుకు చెందిన ఓ రైతు మాత్రం అలా బాధ పడుతూ కూర్చోలేదు. తన ఆవును చంపిన పులిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. దానికి పక్కా ప్లాన్ వేశాడు. చనిపోయి ఆవు కళేేబరాన్నే పులులకు ఎరగా వేశాడు. ఆవు కళేబరంపై పురుగుల మందు చల్లాడు. దాన్ని చూసి అటుగా వచ్చిన పులులు ఆవు కళేబరాన్ని తిన్నాయి. కాసేపటికే మృత్యు వాత పడ్డాయి. ఈ ఘటన తమిళనాడులోని నీలగిరి జిల్లాలో చోటుచేసుకుంది.
జిల్లాలో ఓ అడవిలోని నీటికుంట వద్ద మూడేళ్లు, ఎనిమిదేళ్ల వయసున్న రెండు పులుల మృతదేహాలు కాస్త ఎడంగా పడుండటం గుర్తించి అధికారులు విచారణ చేపట్టారు. పులుల మృత కళేబరాలకు సమీపంలోనే మరో ఆవు చచ్చి పడుంది. మూడు కళేబరాల నమూనాలను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం కోయంబత్తూరుకు పంపారు. ఆ మృత కళేబరాల్లో పురుగుమందుల అవశేషాలు ఉన్నట్టు నివేదిక వచ్చింది. విషపూరితమైన ఆవు మృత కళేబరాన్ని తినడం వల్లే పులులు చనిపోయినట్టు తేలింది.
ఈ క్రమంలో ఆవు యజమాని శేఖర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం తెలిసింది. పది రోజుల కిందట తన ఆవును పులి చంపిందని.. పులిపై ప్రతీకారం తీర్చుకోవాలని.. సగం తిని వదిలిన ఆవు మృత కళేబరానికి పురుగుమందులు పూసి తానే విషపూరితం చేసినట్టు అంగీకరించాడు.