అత్త వారింట్లో అమ్మాయికి ఏదైనా కష్టం వస్తే.. సాధారణంగా తల్లిదండ్రు కాంప్రమైజ్ అయి బతకమని చెబుతారు. ఇక ఆ అమ్మాయి విడాకుల ఊసు తీస్తే సమాజం ఏం అంటుందని వారు భయపడి.. అమ్మాయినీ భయపెడతారు. కానీ ఓ తండ్రి మాత్రం అత్తవారింట్లో తన కూతురు పడే బాధను చూసి తట్టుకోలేకపోయాడు. అంతే కూతురికి విడాకుల కోసం అప్లై చేసి.. విడాకుల ఊరేగింపు నిర్వహించాడు. మేళ తాళాలు, బ్యాండ్ బాజా బరాత్‌తో పుట్టింటికి ఘనస్వాగతం పలికాడు. ఈ సంఘటన ఝార్ఖండ్‌లోని రాంచీలో చోటుచేసుకుంది.
రాంచీలో నివసించే ప్రేమ్ గుప్తా గతేడాది ఏప్రిల్‌లో తన కుమార్తె సాక్షి గుప్తాకు సచిన్ కుమార్ అనే వ్యక్తితో ఘనంగా వివాహం చేశారు. కొన్ని రోజులకే సచిన్ నుంచి తన కుమార్తెకు వేధింపులు మొదలయ్యాయని.. సచిన్‌కు అంతకు ముందే వివాహం అయినట్లు తెలిసిందని, అయినా అతడితో బంధం కొనసాగించాలనే తొలుత నిర్ణయించుకున్నానని సాక్షి తెలిపారు. కానీ, వేధింపులు ఎక్కువ అయ్యేసరికి సచిన్‌కు విడాకులు ఇవ్వాలని నిర్ణయించానని.. అదే విషయం తన తల్లిదండ్రులకు చెబితే తన తండ్రి, కుటుంబ సభ్యులు తన నిర్ణయాన్ని ఒప్పుకున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే సాక్షిని ఇంటికి తీసుకొచ్చేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు.