– కరోనా నేపథ్యమే కారణం అంటున్న కేంద్రం
– సాఫ్ట్ కాపీలను అందరికీ అందిస్తామని సూచన
న్యూఢిల్లీః బడ్జెట్ అనగానే దానికి సంబంధించిన పేపర్లు వగైరా వాటితో ఉభయ సభల్లో వాడి వేడిగా సమావేశాలు జరుగుతాయి. కానీ 1947 తర్వాత తొలిసారిగా పేపర్లు లేకుండానే బడ్జెట్ సమావేశాలను జరిపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్ 2021-22కు సంబంధించిన సమావేశాలు జనవరి 29 నుంచి పార్లమెంట్ లో జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పేపర్లు వాడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
1947 తర్వాత తొలిసారి బడ్జెట్ పత్రాలను ముద్రించకూడదనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ నిర్ణయానికి పార్లమెంట్ ఉభయ సభల నుంచి ఆమోదం కూడా లభించింది. అలాగే ఈ సారి బడ్జెట్ సమావేశాలు రెండు మార్లు జరగనున్నాయి. మొదటి సమావేశాలు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకూ జరుగుతాయి. ఇక రెండో విడత సమావేశాలు మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకూ జరుగుతాయి. బడ్జెట్ సమావేశాల్లోని మొదటి రోజున రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతారు.
అయితే బడ్జెట్ కు సంబంధించి కసరత్తు చివరి దశకు వచ్చినట్లు సమాచారం. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ప్రవేశ పెడుతుంది. ఇప్పటికే 2021-22 బడ్జెట్ కు సంబంధించిన ప్రీ- సంప్రదింపుల్లో భాగంగా పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులతో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సంప్రదింపు జరిపినట్లు సమాచారం.
ఈ సంవత్సరం బడ్జెట్ ఇదివరకటి దాని కంటే కొంచెం భిన్నంగా ఉంటుందని కేంద్రం ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ మేరకు బడ్జెట్ పత్రాలను ముద్రించడం లేమని కేంద్రం పేర్కొంది. అలాగే కరోనా నేపథ్యంలో వందకు పైగా వ్యక్తులను 15 రోజుల పాటూ ప్రింటింగ్ ప్రెస్ లో ఉంచి ఇబ్బందులకు గురి చేయలేమని ఆర్థిక శాఖ ఇప్పటికే తెలియజేసింది. దాంతో కేంద్రం పేపర్ లెస్ సమావేశాలను జరిపేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ బడ్జెట్ కు సంబంధించిన సాప్ట్ కాపీలను సభలోని సభ్యులందరికీ అందుబాటులో ఉంచుతామని కేద్రం పేర్కొంది.