రెండు రోజుల భారత్ పర్యటనలో భాగంగా జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ ఇవాళ ఇండియాకు చేరుకున్నారు. దిల్లీకి చేరుకున్న ఒలాఫ్కు విమానాశ్రయంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఘనస్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి భవన్లో ఒలాఫ్ షోల్జ్ను ప్రధాని మోదీ కలిశారు. త్రివిధ దళాలు ఒలాఫ్కు గౌరవవందనం పలికాయి.
ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఇరుదేశాల వ్యాపార వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త టెక్నాలజీ, ఇంధనం, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంపై చర్చలు జరపనున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్-జర్మనీల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడతాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు. 2021 డిసెంబర్‌లో జర్మన్ ఛాన్సలర్ అయిన తర్వాత షోల్జ్ భారతదేశానికి రావడం ఇదే మొదటి సారి.
2011లో ఇరుదేశాల మధ్య.. ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్ మెకానిజం ప్రారంభమైన తర్వాత జర్మనీ ఛాన్సలర్ భారత్‌లో పర్యటించటం ఇదే మొదటిసారి. ఇరుదేశాలకు చెందిన సీఈవోలు, పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కానున్నారు. ఈ పర్యటన సందర్భంగా జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోనూ సమావేశం కానున్నారు.