కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన మరోసారి చర్చనీయాంశమవుతోంది. గాంధీ కుటుంబాన్ని ఇటీవల హరియాణా మహిళా రైతులు కలిసిన విషయం తెలిసిందే. వారు సోనియా గాంధీతో మాట్లాడుతూ రాహుల్ వివాహం గురించి అడిగారు. మరి దానికి ఆమె ఏం సమాధానం చెప్పారంటే..?
జులై ఆరంభంలో రాహుల్‌గాంధీ హరియాణాలో పర్యటించిన సమయంలో.. సోనీపత్ జిల్లా మదీనా గ్రామ మహిళా రైతులు దిల్లీకి రావాలని ఉందని చెప్పారు. దాంతో ఆయన వారిని సోనియా నివాసానికి ఆహ్వానించారు. ఇటీవల ఆ మహిళలంతా దిల్లీ వెళ్లారు. ముందుగా దిల్లీలోని పలు ప్రాంతాలను సందర్శించారు. అనంతరం జన్‌పథ్‌లోని సోనియా నివాసానికి చేరుకోగా వారికి గాంధీ కుటుంబం సాదరంగా ఆహ్వానించింది. ప్రత్యేక ఆతిథ్యం ఏర్పాటు చేయడమే గాక.. సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీ కూడా మహిళలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఓ మహిళ సోనియా గాంధీ చెవిలో.. ‘రాహుల్‌కు పెళ్లి చేద్దామా?’ అని అడిగారు. దీనికి ఆమె బదులిస్తూ.. ‘మీరే ఓ మంచి అమ్మాయిని చూడండి’ అని అనడంతో రాహుల్ నవ్వుతూ ‘అవుతుంది.. అవుతుంది’ అని చెప్పారు.