సాధారణంగా శ్రీరామనవమి పండుగ సందర్భంగా దేవాలయాలు అన్ని భక్తులతో కిటకిటలాడుతుంటాయి.ముఖ్యంగా సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రామాలయాల్లో శ్రీ సీతారాముల వారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు.
రేపు శ్రీరామనవమి కావడంతో అయోధ్యలోని బాలరాముడి దర్శనం పై ఆలయ ట్రస్ట్ ఓ కీలక ప్రకటన చేసింది. బుధవారం ఉదయం 3.30 గంటలకు మంగళహారతితో ప్రారంభం అవుతుంది. రాత్రి 11 గంటల వరకు బాలరాముడి ఆలయం తెరిచి ఉంటుందని పేర్కొంది. శ్రీరామనవమి నేపథ్యంలో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని ట్రస్ట్ సభ్యులు అంచనా వేస్తున్నారు. రద్దీనీ దృష్టిలో ఉంచుకొని స్పెషల్ పాస్ బుకింగ్స్ ని రద్దు చేశారు. విశిష్ట అతిథులు ఎవరైనా ఉన్నట్టయితే ఏప్రిల్ 19 తరువాత బాలరాముడి దర్శనం కోసం రావాలని ట్రస్ట్ నిర్వాహకులు సూచించారు. ఇందుకు అందరూ సహకరించాలని కోరారు.