ఐఐటీ బాంబే విద్యాసంస్థలో కొందరు విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్ వివాదాస్పదంగా మారింది. రామాయణాన్ని అపహాస్యం చేసేలా విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్‌పై పెద్దఎత్తున విమర్శలు రావడంతో యాజమాన్యం వారిపై చర్యలకు ఉపక్రమించింది. ఒక్కో విద్యార్థికి రూ.1.20లక్షల చొప్పున జరిమానా విధించింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఈ ఏడాది మార్చి నెలాఖరున ఐఐటీ బాంబేలో జరిగిన వార్షిక ఆర్ట్స్ ఫెస్టివల్‌లో కొందరు విద్యార్థులు ‘రామాయణ’ ఇతిహాసం ఇతివృత్తంగా ‘రాహోవన్’ పేరుతో ఓ నాటకాన్ని ప్రదర్శించారు. అందులో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడి పేర్లను నేరుగా ఉపయోగించనప్పటికీ.. అరణ్యవాసంలోని కొన్ని ఘట్టాలను పోలిన సన్నివేశాలను ప్రదర్శించగా.. ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
అందులో విద్యార్థులు ఉపయోగించిన భాష, హావభావాలు అనుచితంగా ఉండటంతో ఆ స్కిట్‌పై విమర్శలు వెల్లువెత్తగా ఐఐటీ బాంబే యాజమాన్యం చర్యలు చేపట్టింది. క్రమశిక్షణా కమిటీని ఏర్పాటుచేసి ఘటనపై దర్యాప్తు జరిపింది. అనంతరం నాటిక ప్రదర్శించిన విద్యార్థులపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. వీరిలో సీనియర్లకు ఒక్కొక్కరికీ రూ.1.2లక్షల చొప్పున జరిమానా విధించింది. జూనియర్లకు రూ.40వేలు చొప్పున జరిమానా వేయడంతో పాటు హాస్టల్ సదుపాయాలను పొందడంపై నిషేధం విధించింది.