దేశ రాజధాని నగరం దిల్లీలో వరణుడు బీభత్సం సృష్టించాడు. గంటపాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో నగరం అతలాకుతలం అయిపోయింది. భారీ వర్షాలతో రాజధాని అట్టుడికిపోతోంది. బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సెంట్రల్ దిల్లీలోని ప్రగతి మైదాన్ అబ్జర్వేటరీలో కేవలం ఒక గంట వ్యవధిలో 112.5 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రహదారులపైన నడుములోతు నీరు నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. దిల్లీకి రావాల్సిన విమానాలను ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దారి మళ్లించినట్లు సమాచారం. మరోవైపు భారీవర్షాలు ఉన్నందున ఐఎండీ దిల్లీలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇటీవల ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మరణించిన రాజేంద్రనగర్ ప్రాంతం మరోసారి వరద నీటితో మునిగిపోయింది. ఆ ప్రాంతంలోనే అనేక కోచింగ్ సెంటర్లలోకి నీరు వచ్చిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అక్కడ మోకాళ్లలోతు నీరు నిలిచిపోయి విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.