ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్ మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. ఏడు దఫాలుగా ఈ దేశమే అగ్రభాగన కొనసాగుతుండడం విశేషం. ‘అంతర్జాతీయ ఆనంద దినోత్సవ’మైన ఇవాళ (మార్చి 20న) యూఎన్ ఆధారిత సంస్థ తాజా ర్యాంకులను విడుదల చేసింది. ప్రపంచంలోని 143కి పైగా దేశాల ప్రజల మనోభావాలను తెలుసుకుని దీన్ని రూపొందించినట్లు తెలిపింది.
సంతోష సూచీల్లో నార్డిక్ దేశాలైన ఫిన్లాండ్(1), డెన్మార్క్(2), ఐస్‌లాండ్(3) వరుసగా తొలి మూడు ర్యాంకులను దక్కించుకోగా భారత్ 126వ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఒకస్థానం కిందకు దిగజారడం గమనార్హం. తాలిబన్ల పాలనలోకి వెళ్లిన తర్వాత తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న అఫ్గానిస్థాన్ ఈ జాబితాలో అట్టడుగున నిలిచింది.
ఫిన్లాండ్ ప్రజలు ఆనందంగా ఉండడానికి ప్రకృతితో దగ్గరి సంబంధం, ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కారణమని యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకీ పరిశోధకురాలు జెన్నిఫర్ డీ పావోలా వెల్లడించారు. ‘జీవితంలో విజయం’ అనే అంశంపై అక్కడి ప్రజలకు మెరుగైన అవగాహన ఉందని తెలిపారు. ఫిన్లాండ్‌లో ప్రభుత్వ వ్యవస్థలపై విశ్వాసం, చాలా తక్కువ స్థాయిలో అవినీతి, ఉచిత ఆరోగ్య సంరక్షణ, విద్య కూడా వారి సంతోషకరమైన జీవితానికి మరికొన్ని కారణాలుగా పేర్కొన్నారు.