దేశంలో తొలిసారిగా జనవరి 2020లో మొదటి కోవిడ్ covid19 కేసు కేరళలో నమోదైన విషయం విదితమే. చైనాలోని వూహాన్‌లో ఓ మెడికల్ కాలేజీలో చదువుతున్న కేరళకు చెందిన త్రిసూర్‌లోని ఓ విద్యార్థిని జనవరి 2020లో ఇండియాకు వచ్చింది. అక్కడ కోవిడ్ వ్యాప్తి చెందుతుండడంతో ఆమె భారత్‌కు వచ్చింది. అయితే ఆమెకు అప్పట్లో లక్షణాలు లేకపోయినా టెస్టు చేస్తే కోవిడ్ పాజిటివ్ అని తేలింది. కాగా అప్పట్లో ఆమె కోలుకున్నా తాజాగా మళ్లీ ఆమెకు కోవిడ్ సోకింది.
సదరు విద్యార్థినికి రెండోసారి కోవిడ్ పాజిటివ్ అని తేలిందని, ఆమె ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటుందని, ఆమె కుటుంబ సభ్యులకు కోవిడ్ సోకలేదని.. త్రిసూర్ జిల్లా మెడికల్ ఆఫీసర్ కేజే రీనా తెలిపారు. కోవిడ్ మళ్లీ వ్యాప్తి చెందడం కొత్తేమీ కాదని, గతంలో ఒక్కసారి కోవిడ్ సోకిన వారికి మళ్లీ మళ్లీ ఇన్‌ఫెక్షన్ సోకిందని తెలిపారు. హెల్త్ వర్కర్లకు రెండు సార్లు కోవిడ్ వచ్చి వెళ్లిందన్నారు.
అయితే ఇతర దేశాల విద్యార్థులను చైనా ఇప్పటికీ తమ దేశంలోకి అనుమతించడం లేదు. అక్కడ కోవిడ్ వ్యాప్తి లేనప్పటికీ ఇంకా ఇతర దేశాల వారిని అనుమతించడం లేదు. ఇక సదరు విద్యార్థిని ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు మొదటి సారి కోవిడ్ సోకినప్పుడు లక్షణాలు ఏమీ లేవని, జనవరి 27 నుంచి ఫిబ్రవరి 20 వరకు 24 రోజుల పాటు ఐసొలేషన్‌లో ఉండి చికిత్స తీసుకున్నానని తెలిపింది.
కాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనం ప్రకారం గతేడాది జనవరి నుంచి అక్టోబర్ మధ్య 4.5 శాతం రీ ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. ఒకసారి కోవిడ్ సోకిన వారిలో యాంటీ బాడీలు చాలా తక్కువ సమయంలోనే నశిస్తున్నాయని, దీంతో వారికి రెండోసారి కూడా కోవిడ్ సోకుతుందని నిపుణులు చెబుతున్నారు.