విమానయాన సంస్థ ఇండిగో, ముంబయి విమానాశ్రయం, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్‌లకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) షాక్ ఇచ్చింది. వివిధ రకాల ఉల్లంఘనలకు పాల్పడిన కారణంగా రూ.2.70 కోట్ల జరిమానా విధించాయి. విమానం ఆలస్యం కావడం వల్ల ముంబయి ఎయిర్పోర్టులో నేలపైనే ప్రయాణికులు ఆహారం తీసుకున్న వీడియో నెట్టింట వైరల్ అయింది. అది కాస్త ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో బీసీఏఎస్ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది.
ఈ క్రమంలోనే ఇండిగో సంస్థపై బీసీఏఎస్ రూ.1.20 కోట్లు జరిమానా విధించింది. దాంతో పాటు ముంబయి ఎయిర్ పోర్టుపై రూ.60 లక్షలు ఫైన్ వేయగా.. ఇదే సంఘటనకు సంబంధించి ఇండిగోపై డీజీసీఏ రూ.30 లక్షలు పెనాల్టీ వేసింది. మరోవైపు పైలట్ల రోస్టరింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.30 లక్షలు చొప్పున జరిమానా విధించింది.