అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకకు ముహూర్తం దగ్గర పడింది. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.20 గంటలకు రామ్ లల్లా తొలిపూజను అందుకోనున్నాడు. దీనికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు ముందే శ్రీరాముడి దివ్యమంగళ రూపానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చకముందే కళ్లకు ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా ఉన్నపుడు తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
ఈ వ్యవహారంపై ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గర్భగుడిలోకి చేర్చిన శ్రీరాముడి విగ్రహం కళ్లకు ఆచ్ఛాదనగా వస్త్రం కట్టిపెట్టామని.. ప్రాణప్రతిష్ఠ సమయంలోనే ఆ వస్త్రాన్ని తొలగిస్తామని చెప్పారు. కానీ అంతకంటే ముందే పూర్తిరూపం కనిపించే ఫొటోలను బయటపెట్టడం సరికాదని.. అలా బయటకు వచ్చిన చిత్రాలపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఆ పని ఎవరు చేశారో గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు డిమాండ్ చేశారు. కాగా ఈ వ్యవహారంపై శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు అంతర్గత విచారణ చేపట్టింది.