జాబిల్లిపై పరిశోధనల కోసం ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 జాబిల్లికి మరింత చేరువైంది. ఈ వ్యోమనౌక మిషన్ ల్యాండర్ మాడ్యూల్.. చంద్రుని ఉపరితలానికి మరింత చేరువైనట్లు ఇస్రో తెలిపింది. ల్యాండర్ మాడ్యూల్ కక్ష్యను తగ్గించేందుకు చేపట్టిన రెండో డీ-బూస్టింగ్ ఆపరేషన్ విజయవంతం అయినట్లు ప్రకటించింది. ల్యాండర్ మాడ్యూల్ కక్ష్యను 25 కిలోమీటర్లు బై 134 కి.మీ తగ్గించినట్లు వెల్లడించింది.
ఈ క్రమంలో ఈనెల 23న చంద్రుని దక్షిణధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే సాఫ్ట్ ల్యాండింగ్ సమయం మారిందని.. ముందు ఈనెల 23న సాయంత్రం 5గంటల 45నిమిషాలకు నిర్ణయించగా… తాజాగా ఆ సమయాన్ని సాయంత్రం 6 గంటల 4నిమిషాలకు మార్చినట్లు వెల్లడించారు సాఫ్ట్ ల్యాండింగ్‌కు ముందు ల్యాండర్ మాడ్యూల్‌లో అంతర్గత తనిఖీలు చేయనున్నట్లు చెప్పారు. ల్యాండింగ్ ప్రాంతంలో సూర్యోదయం వరకు వేచి చూడనున్నట్లు వెల్లడించింది.
చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్‌ను వివిధ వేదికలపై ప్రత్యక్షప్రసారం ద్వారా చూసేందుకు ఇస్రో ఏర్పాట్లు చేసింది. ఈనెల 23న సాయంత్రం ఐదు గంటల 27నిమిషాలకు ఇస్రో వెబ్‌సైట్, ఇస్రో యూట్యూబ్ చానల్, ఇస్రో ఫేస్‌బుక్ ఫేజ్, డీడీ నేషనల్ ఛానల్‌లో ప్రత్యక్షప్రసారం చూడొచ్చని తెలిపింది.