భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై చేసిన ట్వీట్పై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో రెండుదేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలకు దారితీసింది. భారత్-మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదంపై విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందించారు. భారతదేశానికి ప్రతిసారి అన్ని దేశాల మద్దతు ఉంటుందని హామీ ఇవ్వలేమని అన్నారు. రాజకీయాలను రాజకీయాల్లాగే చూడాలని.. ప్రతిదేశమూ ప్రతిరోజూ మన అభిప్రాయాలతో ఏకీభవిస్తుందని, మనకు మద్దతు ఇస్తుందని తాను గ్యారంటీ ఇవ్వలేనని వ్యాఖ్యానించారు.
గత పది సంవత్సరాలుగా ఈ ప్రపంచంతో భారత్‌ను అనుసంధానించేందుకు ప్రయత్నిస్తున్నామని జైశంకర్ తెలిపారు. ఈ క్రమంలో ఎన్నో విజయాలు సాధించామని చెప్పారు. ఇతర దేశాలతో స్నేహపూర్వక సంబంధాల కోసం భారత్ ఎంతో ప్రయత్నిస్తోందని చెప్పారు. ప్రపంచ దేశాల్లో కొన్నింటితో రాజకీయ సంబంధాల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ సాధారణంగా ఆయా దేశ ప్రజలు భారత్‌పట్ల సానుకూల భావాలను కలిగి ఉంటారని వెల్లడించారు. భారత్‌తో సత్సంబంధాల ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారని జైశంకర్ వివరించారు.