ఇటీవల ఝార్ఖండ్ రాజధాని రాంచీలో గుట్టలుగా డబ్బులు బయటపడిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులకు ఇందులో కీలక విషయాలు తెలుస్తున్నాయి. రాష్ట్ర మంత్రి ప్రైవేటు కార్యదర్శి పనిమనిషి ఇంటి నుంచి ఈడీ అధికారులు సోమవారం రూ.32కోట్లను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఏడాది క్రితం నాటిరూ.10వేల లంచం కేసు దర్యాప్తులో భాగంగా ఈ అవినీతి బండారం బయటికొచ్చిందని అధికారులు తెలిపారు.
గతేడాది ఫిబ్రవరిలో ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజినీర్ వీరేంద్ర కుమార్ రామ్‌ను రూ.10వేల లంచం తీసుకున్నాడన్న ఆరోపణలపై అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరేంద్రను విచారించగా ఈ హవాలా నెట్‌వర్క్ బయటపడింది. దర్యాప్తులో అతడు కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం. కాంట్రాక్టర్లకు టెండర్ల ఆశ జూపి వారి నుంచి భారీ మొత్తంగా డబ్బులు దండుకున్నట్లు వీరేంద్ర విచారణలో చెప్పినట్లు తెలిసింది. ఇందులో తనతో పాటు చాలా మంది పెద్ద స్థాయి అధికారులు కూడా భాగస్వాములైనట్లు చెప్పినట్లు సమాచారం.