భారత్ వేదికగా దిల్లీలో ఈనెల 9,10వ తేదీల్లో జరగనున్న జీ-20 శిఖరాగ్ర సదస్సుకు దేశవిదేశాల నుంచి అధ్యక్షులు, కీలక నేతలు రానున్నారు. ఇందులో భాగంగానే జీ-20 సదస్సుకు హాజరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా రానున్నారు. అయితే ఆయన శుక్రవారం రోజునే ఇండియాకు వస్తున్నారు. రేపు రాత్రి 7 గంటల సమయంలో దిల్లీకి చేరుకుంటారు. అనంతరం ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అవుతారు.
బైడెన్ పర్యటన నేపథ్యంలో దిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయం నుంచి అమెరికా అధ్యక్షుడు ది బీస్ట్ కారులో ప్రయాణించనున్నారు. ఈ కారు బోయింగ్ సీ-17 విమానంలో యూఎస్ నుంచి దిల్లీకి చేరుకోనుంది. ఇక బైడెన్‌కు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్‌పీజీ), పారా మిలటరీ దళాలు, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ భద్రత నిర్వహించనున్నారు.
జీ0-20 సమ్మిట్‌కు వచ్చే జో బైడెన్ దిల్లీలోని ఐటీసీ మౌర్య షెర్టాన్ హోటల్‌లో బస చేయనున్నారు. ఆ హోటల్‌ను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుని, క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.