కేథార్‌నాథ్ దేవాలయంలో తాపడం చేసిన 228 కేజీల బంగారం అదృశ్యమైందని స్వామీ అవిముక్తేశ్వరానంద ఆరోపించారు. ఈ విషయాన్ని ఎందుకు తొక్కిపెడుతున్నారని ప్రశ్నించారు. దీనిపై ఆలయ కమిటీ ఇవాళ స్పందించింది. కేథార్‌నాథ్ ఆలయంలో 228 కిలోల బంగారం మాయమైందని స్వామీ అవిముక్తేశ్వరానంద ప్రకటనలు చేయడం చాలా దురదృష్టకరం అని బద్రీనాథ్ – కేథార్‌నాథ్ ఆలయ కమిటీ ఛైర్మన్ అజేంద్ర అజయ్ అన్నారు. వాస్తవాలను ప్రపంచం ముందుంచాలని స్వామీజీని కోరుతున్నానని తెలిపారు.
స్వామీజీ ప్రకటనలు చేసే కంటే.. సంబంధిత శాఖకు ఫిర్యాదు చేసి దర్యాప్తునకు డిమాండ్ చేయాల్సిందని పేర్కొన్నారు. అంతేకాదు.. ఆయన వద్ద ఆధారాలు ఉంటే హైకోర్టు లేదా సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని అజేంద్ర వ్యాఖ్యానించారు. కేథార్‌నాథ్ ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించే హక్కు శంకరాచార్య ( స్వామీ అవిముక్తేశ్వరానంద)కు లేదని … ఆయన రాజకీయ లక్ష్యాలతో పనిచేస్తే మాత్రం అది దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆయన కేవలం ఆందోళనలు, వివాదాలు సృష్టించడానికే ఇలా చేస్తున్నారని అజేంద్ర అజయ్ మండిపడ్డారు.