కెనడా ప్రధాని భారత్​లో ఉండగానే.. ఆ దేశంలో ఇండియన్​ ఎంబసీ మూసివేయాలని బెదిరింపు కాల్

-

భారత్​లో ఇటీవల జరిగిన జీ20 సదస్సుకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హాజరైన విషయం తెలిసిందే. అయితే ఆయన సదస్సు ముగిసిన వెంటనే ఆయన తిరుగు ప్రయాణం కావాల్సి ఉండగా.. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో కెనడా ప్రధానితో సహా ఆ దేశ ప్రతినిధులంతా మంగళవారం కూడా భారత్‌లోనే ఉండాల్సి వచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం తిరుగుప్రయాణం అవుతారని తెలుస్తోంది. అయితే ఓవైపు ట్రూడో భారత్​లో ఉండగానే ఒట్టావాలోని భారత ఎంబసీని మూసివేయాలని మంగళవారం రోజున బెదిరింపు కాల్‌ వచ్చిందని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అలాగే హై కమిషనర్‌ను వెనక్కి రప్పించాలని ఆ కాల్‌లో హెచ్చరించినట్లు తెలుస్తోంది.

కెనడాలో కొనసాగుతోన్న ఖలిస్థానీ సానుభూతిపరుల దుశ్చర్యలపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో జీ-20 సదస్సులో ప్రధాని మోదీ.. ట్రూడోతో సమావేశమైన రెండ్రోజుల తర్వాత ఈ బెదిరింపు రావడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. 48 గంటల్లో ఇది రెండో కాల్‌ అని సమాచారం. భారత్‌ పర్యటనలో ట్రూడో ఇబ్బందిగా కనిపించడానికి భారత ప్రభుత్వ వైఖరే కారణమని మిలిటెంట్‌ గ్రూప్‌ ఆరోపించింది. వెంటనే తన రాయబారిని వెనక్కి పిలవకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version