బుల్డోజర్‌ స్టీరింగ్‌ వదలను-యోగి ఆదిత్యనాథ్‌

-

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు.సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 9 నెలల సమయం ఉండగా రాజకీయ పక్షాలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకెళుతున్నాయి.దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి కనిపిస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోనూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రచారాన్ని ప్రాంభించేశారు.ప్రధాని మోడీతో కలిసి వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన యోగి ప్రతిపక్షాలను టార్గెట్‌ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.అనంతరం మిల్కీపూర్, బికాపూర్‌లలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమాల్లో కాంగ్రెస్, ఎస్పీ పార్టీలను తీవ్రంగా టార్గెట్ చేశారు. రామమందిరానికి కాంగ్రెస్ తాళం వేసిందన్న యోగి సమాజ్‌వాది పార్టీ ప్రభుత్వ పాలనలో రామభక్తులపై తూటాలు పేల్చిందని ఆగ్రహం చెందారు.వందలాది మంది రామభక్తులను పొట్టన పెట్టుకున్న ఆ పార్టీలను బహిష్కరించాలని యోగి పిలుపునిచ్చారు.నేడు ప్రపంచం మొత్తం అయోధ్య వైపు చూస్తోందన్నారు.ప్రస్తుత ప్రభుత్వానికి ఒక చేతిలో అభివృద్ధి లాఠీ, మరో చేతిలో బుల్డోజర్ స్టీరింగ్ ఉందని పేర్కొన్నారు.గూండాలను, ఉగ్రవాదులను అంతమొందించేందుకు బుల్డోజర్లను ఉపయోగిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.

ఉత్తర ప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలను క్లీన్‌స్వీప్‌ చేయాలని ప్రధాని మోడీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌కు సూచించారు.ఈ క్రమంలో గతంలో పోగొట్టుకున్న సీట్లను బీజేపీ ఖాతాలో వేసేందుకు ముఖ్యమంత్రి యోగి పక్కా వ్యూహంతో అడుగులేస్తున్నారు.ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా వాగ్బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఓ వైపు గత ప్రభుత్వాలు చేసిన నష్టాలను వివరిస్తూ బీజేపీ వచ్చాక చేస్తున్న అభివృద్ధి పథకాలను వివరిస్తున్నారు. ఒకప్పుడు గుండాలు,రౌడీలు,మాఫియాలు,ముఠాలు రాజ్యమేలుతుండేవని చెప్తూ తాను వచ్చాక బుల్డోజర్‌తో అక్రమార్కుల భరతం పట్టానని స్పష్టం చేశారు.మహిళలు అత్యంత సురక్షితంగా యుపీలో బ్రతుకుతున్నారని చెప్తూ ప్రశాంత వాతావరణం తెచ్చేందుకు అసాంఘిక శక్తుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించామని గుర్తు చేశారు.

కరోనా మహమ్మారి సమయంలో ఉచితంగా పరీక్షలు నిర్వహించామని, ఉచిత చికిత్సకు ఏర్పాట్లు చేశామని, ఉచితంగా వ్యాక్సిన్లు కూడా ఇచ్చామని చెప్పారు. దీనితో పాటు, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కూడా ప్రజలకు డబుల్ డోస్ రేషన్ ఇస్తోందన్నారు. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ ఎప్పుడైనా ఈ పని చేశాయా? గత ప్రభుత్వంలో ఈద్, మొహర్రంలకు కరెంటు వచ్చేదని, హోలీ, దీపావళి రోజుల్లో కరెంటు కోతలు ఉండేవని నాటి ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలకు ఎలాంటి వివక్ష లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని స్పష్టం చేశారు.ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ఉచిత రేషన్, పింఛను, ఇతర ప్రజా సంక్షేమ పథకాలను ఎలాంటి వివక్ష లేకుండా అమలు చేస్తున్నారు. ఎస్పీకి రాష్ట్రంలో అభివృద్ధి అక్కర్లేదని సీఎం అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి పక్షాలకు మళ్ళీ పరాభవం తప్పదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version