సంజయ్ రాయ్ కు మరణశిక్ష పడేలా హైకోర్టులో అప్పీల్ కు వెళ్తాం : సీబీఐ

-

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రి జూనియర్ డాక్టర్ పై హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్ కి సీల్దా కోర్టు విధించిన శిక్షపై సీబీఐ అప్పీల్ కి వెళ్లనుంది. విధుల్లో ఉన్న వైద్యురాలిపై పాశవికంగా దాడికి పాల్పడిన ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై కలకత్తా హైకోర్టులో అప్పీల్ చేసేందుకు సిద్ధమైంది. ఈ కేసు అత్యంత అరుదైన నేరం కేటగిరీలోకి వస్తుందని, మరణశిక్షకు అర్హమైనదేనంటూ సీబీఐకి న్యాయ సలహా అందడంతో.. దోషికి మరణ దండన విధించాలని హైకోర్టును కోరనుంది.

కింది కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ సవివరమైన వాదనలతో శుక్రవారం నాటికి అప్పీల్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు సీబీఐ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు, ఈ కేసుపై సోమవారం తీర్పు వెలువరించిన సమయంలో సియాల్దా అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు జడ్జి అనిర్బన్ దాస్ మాట్లాడుతూ.. సంజయ్ రాయికి సీబీఐ మరణశిక్ష విధించాలని కోరిందన్నారు. అయితే, డిఫెన్స్ న్యాయవాది మరణ దండనకు బదులుగా జైలు శిక్ష విధించాలని అభ్యర్థించారన్నారు. ఈ నేరం అత్యంత అరుదైన నేరం కేటగిరీలోకి రాదని పేర్కొన్న ఆయన.. దోషికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version