9 ఏళ్లలో రికార్డు స్థాయిలో పెరిగిన ఎల్పీజీ కనెక్షన్లు

-

దేశంలో ఎల్పీజీ వినియోగదారుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిందని అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గడిచిన 9 ఏళ్లలో కొత్తగా 17 కోట్ల మంది వినియోగదారులు ఎల్పీజీ కనెక్షన్లు తీసుకున్నారు.  2014 ఏప్రిల్‌లో 14.52 కోట్ల మందిగా ఉన్న గ్యాస్‌ వినియోగదారుల సంఖ్య 2023 నాటికి 31.36 కోట్లకు చేరింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన దీనికి దోహదం చేసింది. గతంతో పోలిస్తే ఎల్పీజీ సిలిండర్ల లభ్యత కూడా పెరిగింది. ఒకప్పుడు సిలిండర్‌ రావడానికి సగటున 7-10 రోజులు పట్టేది. ఇప్పుడు చాలా చోట్ల 24 గంటల్లోనే వంట గ్యాస్‌ ఇంటికి చేరుతోంది.

మరోవైపు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా ఆకాశాన్నంటాయి. ప్రస్తుతం ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1100 లకు పైగానే ఉంది. ఇక ప్రతి పేదవారికి గ్యాస్‌ సిలిండర్‌ ఉండాలనే ఉద్దేశంతో 2016 మే 1న ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను ప్రారంభించిన విషయం తెలిసిందే. మొదట్లో 5 కోట్ల మంది మహిళలకు ఎల్‌పీజీ కనెక్షన్లు అందించటమే లక్ష్యంగా పెట్టుకున్నా.. తర్వాత దాన్ని 8 కోట్లకు సవరించారు. మరింత మందికి లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో 2021 ఆగస్టు 10న ఉజ్వల్‌ 2.0ని కేంద్రం ప్రారంభించింది. దాన్ని మళ్లీ పొడిగించి మరో 60 లక్షల కనెక్షన్లు అందించాలని కేంద్రం నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version