శానిటైజర్‌ రాసుకున్నాక సిగరెట్‌ వెలిగించాడు.. అగ్ని ప్రమాదం బారిన పడ్డాడు..!

-

కరోనా నుంచి రక్షణ అందిస్తాయని మనం హ్యాండ్‌ శానిటైజర్లను ఎక్కువగా వాడుతున్నాం. అయితే వీటి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే ప్రమాదాలు జరుగుతాయి. చెన్నైకి చెందిన ఓ వ్యక్తి హ్యాండ్‌ శానిటైజర్‌ వల్ల అగ్ని ప్రమాదం బారిన పడ్డాడు. దీంతో అతను ప్రస్తుతం హాస్పిటల్‌లో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.

చెన్నైలోని అశోక్‌నగర్‌ అనే ప్రాంతంలో నివాసం ఉండే 50 ఏళ్ల రుబన్‌ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. గత శనివారం రాత్రి అతను పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. వెంటనే హ్యాండ్‌ శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకున్నాడు. అయితే శానిటైజర్‌ కొంత అతని షర్ట్‌పై పడింది. ఈ క్రమంలో అతను చూసుకోకుండా బాత్‌రూమ్‌కు వెళ్లాడు. అదే సమయంలో సిగరెట్‌ వెలిగించాడు. దీంతో సిగరెట్‌ నుంచి కొన్ని నిప్పు రవ్వలు వచ్చి అతని షర్ట్‌ మీద పడ్డాయి. వెంటనే మంటలు చెలరేగాయి.

మంటలు వ్యాప్తి చెందగానే అతను బిగ్గరగా కేకలు వేశాడు. ఇంట్లోని కుటుంబ సభ్యులు వెంటనే అతని వద్దకు వెళ్లి మంటలను ఆర్పారు. అనంతరం చికిత్స నిమిత్తం అతన్ని కిల్‌పౌక్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి తరలించారు. అతని ముఖం, మెడ, ఛాతి, పొట్ట, చేతుల భాగాల్లో తీవ్రంగా కాలి గాయాలు అయ్యాయని, ప్రస్తుతం అతను విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. కనుక హ్యాండ్‌ శానిటైజర్‌లను వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. శానిటైజర్‌ను శరీరం మీద పడకుండా చూసుకోవాలని, దుస్తుల మీద పడితే వెంటనే వాటిని మార్చుకోవాలని, అలాగే చేతులకు శానిటైజర్‌ రాసుకున్నాక కొంత సేపు ఆగితే అది ఆవిరైపోతుందని, అప్పటి వరకు మంట దగ్గర ఉండడం కానీ, మంటను వెలిగించడం కానీ చేయకూడదని సూచిస్తున్నారు. శానిటైజ‌ర్‌ల‌లో 62 శాతం వ‌ర‌కు ఆల్క‌హాల్ ఉంటుంది క‌నుక జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version