అసెంబ్లీ సెగ్మెంట్‌కు 50 వేల మెజారిటీ..తిరుపతిలో వైసీపీ కొత్త లెక్కలు

-

తిరుపతి ఉప ఎన్నికలో త్రిముఖ పోరు రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలు ప్రచారపర్వంలో దూసుకెళ్తున్నాయ్. గెలుపు కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయ్. గతంలో వచ్చిన ఓట్లను అంచనా వేసుకుంటూ గెలుపు లెక్కలేస్తున్నాయి. పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ అన్ని పార్టీల్లోనూ టెన్షన్ మొదలైంది. రికార్డు మెజారిటీ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ నియోజకవర్గాల వారీగా ఓట్ల పై లెక్కలు మొదలుపెట్టింది.

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. గత ఎన్నికను ప్రస్తుత ఉప ఎన్నికతో పోల్చి చూస్తున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు. గెలవాలంటే ఎన్ని లక్షల ఓట్లు రావాలనే బీజేపీ,టీడీపీ లెక్కలేస్తుంటే వైసీపీ మాత్రం మెజారిటీ విషయంలో లెక్కలేస్తుంది. గత ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ పరిధిలో మొత్తం 16 లక్షల 50 వేల 453 మంది ఓటర్లు ఉన్నారు. ఆ ఎన్నికల్లో 12 లక్షల 87 వేల734 ఓట్లు పోలయ్యాయ్. 2 వేల 958 ఓట్లు చెల్లకుండా పోయాయ్. నోటాకు 25 వేల 781 ఓట్లు పడ్డాయ్. ప్రస్తుత ఎన్నికల్లో ఓటర్లు గతంలో కంటే పెరిగారు. 16 లక్షల 89 వేల 934 మంది ఓటర్లు ఈ ఉప ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు.

2019 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభకు తెలుగుదేశం పార్టీ నుంచి పనబాక లక్ష్మీ పోటీ చేశారు. 4 లక్షల 94 వేల 501 ఓట్లు సాధించారు. బల్లి దుర్గాప్రసాద్ వైసీపీ నుంచి బరిలో నిలిచారు. మొత్తం 7 లక్షల 22 వేల 877 ఓట్లు దక్కించుకొని భారీ విజయం సాధించారు. జనసేన మద్దతిచ్చిన బీఎస్పీ అభ్యర్ది దగ్గుమాటి శ్రీహరి రావు 20 వేల 971 ఓట్లు సాధించారు. బొమ్మి శ్రీహరిరావు బీజేపీ నుంచి బరిలో నిలిచారు. 16 వేల 125 ఓట్లు రాబట్టుకున్నారు. 2014లో టీడీపీ మద్దతుతో పోటీ చేసిన బీజేపీకి ఐదు లక్షలకు పైగా ఓట్లు సాధించింది.

గెలుపు ఖాయం అనుకుంటున్న వైసీపీ రికార్డు మెజారిటీపై దృష్టి పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగు లక్షలకు ఒక్క ఓటు కూడా తగ్గవద్దని టార్గెట్ పెట్టారు సీఎం జగన్. రంగంలోకి దిగిన మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. వైసీపీకి నాలుగు లక్షల మెజారిటీ రావాలంటే మిగిలిన పార్టీలకు పోలయ్యే ఓట్లలో భారీగా తగ్గాలి. అంటే గత ఎన్నికల్లో 4.90 లక్షల ఓట్లు ఉన్న టీడీపీకి భారీగా ఓట్లు తగ్గాల్సి ఉంటుంది. జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థికి పెద్దగా ఓట్లు పోలవకూడదు. వైసీపీ నేతలు ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌కి 50 వేల మెజారిటీ అంచనా వేస్తున్నారు.

ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో 80 శాతం, మున్సిపాలిటీలో 100 శాతం సీట్లు గెలుచుకొని వైసీపీకి తిరుగు లేదని నిరూపించుకుంది. ఇక ఉపఎన్నికలో సైతం అదే జోష్ కంటిన్యూ చేస్తూ అసెంబ్లీ సెగ్మెంట్‌కి 50 వేల రాబట్టుకుని మిగిలిన చోట్ల ఇంకో యాభై వేలు రాబట్టుకుంటే టార్గెట్‌ ఈజీగా రీచ్‌ కావచ్చని లెక్కలేస్తుంది. . వైసీపీకి భారీ మెజారిటీ రాకూడదనుకుంటే టీడీపీ మొన్నటి ఎన్నికల్లో వచ్చిన ఓట్లనైనా నిలబెట్టుకోవాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version