కుమారుడు పదో తరగతిలో ఉండగా.. అతడిని ప్రోత్సహించేందుకు ఆ తల్లీ చదివింది. క్రమంగా చదువుపై మరింత మక్కువ పెంచుకున్న ఆమె.. పోటీ పరీక్షలకు సిద్ధమై ఏకంగా ప్రభుత్వ కొలువు సాధించింది. కుమారుడు కూడా జాబ్ సాధించడంతో ఆ ఇరువురు ఒకేసారి ప్రభుత్వ కొలువులో చేరనున్నారు. చదువులో కుమారుడిని తల్లి ప్రోత్సహిస్తే.. కొలువు సాధించడంతో తల్లికి కుమారుడి ప్రోత్సాహం దక్కింది. విఫలమైనా.. ప్రయత్నిస్తూ ఉంటే విజయం సాధిస్తామని ఆ తల్లి ధీమాగా చెబుతోంది.
కేరళలోని మలప్పురానికి చెందిన బిందు బేగన్ (42) అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమె కుమారుడు పదో తరగతిలో ఉండగా.. అతడిని ఉత్తేజపరిచేందుకు ఆమె కూడా పుస్తకాలు చదవడం ప్రారంభించారు. మొదట కథల పుస్తకాలతో మొదలైన ఆమె ప్రస్థానం.. చదువుపై మక్కువ పెరగడంతో పోటీ పరీక్షలవైపు వైపు మళ్లింది. కుమారుడి పదో తరగతి పరీక్షల తర్వాత ఆమె కోచింగ్ సెంటర్‌లో చేరి కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షలకు సన్నద్ధమయ్యారు.
మొదటి మూడు ప్రయత్నాల్లో విఫలమైనా.. నాలుగోసారి ఆమె విజయవంతమయ్యారు. తాజాగా లాస్ట్ గ్రేడ్ సర్వెంట్ (LGS) కొలువు సాధించారు. ఇందుకు ఆమె తొమ్మిదేళ్లు కృషి చేయడం విశేషం. డిగ్రీ పూర్తి చేసిన ఆమె 24 ఏళ్ల కుమారుడు సైతం లోవర్ డివిజనల్ క్లర్క్ (LDC) పరీక్షలో పాసయ్యాడు. త్వరలోనే వారు ఆయా ఉద్యోగాల్లో కొలువుదీరనున్నారు. బిందు బేగన్ గురించి కోచింగ్ సెంటర్ ప్రతినిధులు, సెంటర్‌లోని ఆమె మిత్రులు మాట్లాడుతూ ఆమె తొమ్మిదేళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కిందన్నారు. కుమారుడు ఆమెను ఎంతగానో ప్రోత్సహించాడని తెలిపారు.