అది పులి కాదు పిల్లి.. రాష్ట్రపతి భవన్​లో వింతజంతువుపై క్లారిటీ

-

 రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం కేంద్ర మంత్రిమండలి ప్రమాణస్వీకారం వేడుకలో ఓ వింత జంతువు కనిపించిన వీడియో నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే  పులిలాంటి ఆకారంలో ఉన్న జంతువును చూసి అందరూ పులి వచ్చిందని భావించారు. అంతటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమం, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, పలు దేశాల అధినేతలు ఉన్న కార్యక్రమంలో ఇలాంటి జంతువు సంచరించడం భద్రతా వైఫల్యమేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో ఈ జంతువుపై దిల్లీ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఆ జంతువు పులి కాదని పిల్లి అని తెలిపారు. బీజేపీ ఎంపీ దుర్గాదాస్‌ ఉయికె ప్రమాణస్వీకారం చేశాక రాష్ట్రపతి భవన్​ కారిడార్​లో నాలుగు కాళ్ల జంతువు ఆకారం వెళుతుండడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ కాగా, కొందరు ఈ జంతువు చిరుతపులి అని అన్నారు. దీనిపై దిల్లీ పోలీసులు స్పందిస్తూ..  వైరల్ అయిన వీడియో గురించి తెలియగానే తాము రాష్ట్రపతి భవన్‌ భద్రతా సిబ్బందితో మాట్లాడామని.. రాష్ట్రపతి భవన్‌ ఆవరణలో ఎలాంటి చిరుతపులి లేదని వారు తెలిపారని చెప్పారు. కేవలం కుక్కలు, పిల్లులు మాత్రమే ఉన్నట్లు స్పష్టంచేశారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version